Tuesday, January 08, 2008

"ఆసీ " మంకీ బిజినెస్..

ఏమిట్రా ఆ కోతి పనులు అందామనిపించి అయ్యో సిడ్నీ లో కదా వున్నాం జర బద్రం కొడకో అని ఎవడో కోతిగాడు హెచ్చరించి నట్టు వుంటే ఎందుకులే అని వూరుకొన్నాను.


నిజానికి ఆసీల పుట్టు పూర్వొత్తరాల గురుంచి తెలిసిన ఎవ్వడు అలా అనడు. తనది ఏ జాతియో ఇప్పటికి పూర్తిగా తెలియని వాళ్ళని పట్టుకొని మరీ "జాతి వివక్షత " తో మాట్లాడితే వాళ్ళు మాత్రం ఎలా సహిస్తారు??


ఆ మద్య "ఆస్ట్రేలియా ఓరియంటెషన్ కోర్స్" అని ఒక కోతి వెదవ క్లాస్ తీసుకొంటె , వెళ్ళి తెలుసుకొన్నది ఏమిటంటె.. వీళ్ళ తాత ముత్తాతలు ఇంగ్లాడులో దొంగతనాలు చేస్తూ పట్టుబడి ఇక్కడ ఖైదీలుగా తేబడ్డారట !!! వారితో బాటుగా కొందరు బ్రిటీష్ పోలీసులు కూడ కాపలాగ వచ్చారు.

ముత్తాతలు ఎట్టివారైనా సరే, వీళ్ళ తరాలకి పునాది అని ఇప్పటికీ.. ఎవరైనా వీళ్ళ కుటుంభంలో పూర్వీకులు 'దొంగలు ' అని చెప్పుకోవటానికి గర్వపడతారు. అది వినగానే అవురా వీళ్ళ గర్వం పాడుగాను అని నా మొబైల్ తీసి జేబులో పెట్టుకొన్నాను (ఎందుకైనా మంచిదని)..

అందుకనే ఇప్పటికి వీళ్ళకి ఏ గేములో నైనా ఇంగ్లాండ్ అంటే విరుద్దం . వేరే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రం కాదు అనుకోండి ( ఇరాక్ యుద్దం, అది ఆయిల్ దొంగతనం కి కదా!!, గర్వ పడే చరిత్రే అది అయినప్పుదు ఇక సిగ్గు ఎందుకు ??)


ఇక జాతి వివక్షత సంగతికి వస్తే , 2003 డిసంబర్ 26 న మెల్బోర్న్ లో మేము, రోజంతా సెహవాగ్ బాటింగ్ చేసినప్పుడు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు బహుసా మళ్ళీ వాల్లకి చూపించినా నమ్మరేమో !!


అడిలైడ్ టెస్ట్ ఇండియా గెలిచినప్పుడు రోడ్డు మీద తప్ప తాగి ఇక్కడ జనం వాగినది రికార్డ్ చేస్తే తెలిసేదేమో ..


మీడియా వాళ్ళు ఇక్కడ పని కట్టుకొని రోజు ఏదొ ఒక ప్రోగ్రం లో ముంబాయ్ లో మన మూక చేసిన చేస్టలు చూపిస్తూ ( FOX TV నక్కలాగ రహస్యంగా చిత్రీకరించనివి) వాళ్ళు చేస్తున్న ఆరోపణలను బలపరుచుకొంటున్నారు , కాదు కాదు బహుసా ఇక్కడ జనంలో అలజడి సృస్టిస్తున్నారు


ఇండియా cricket రివ్యూ అని ముఖ్యంగా మన రోడ్ల మీద తిరుగుతున్న పశువులు ,చెత్త , మురుగు కాలువలు .. . కాస్త గ్రౌండ్ లో పిల్లలు ఆడుతున్న క్రికెట్ , ఇదీ వారి చిత్రీకరణ.
వాళ్ళు ఇవన్నీ చేయటానికి ఒక దేశీ కోతి సహకారం అందించింది.


నాకు తెలిసి మన వాళ్ళు చాలా మందికి బానిసత్వం ఇంకా పోలేదు. అవతల వాడు తెల్ల తొక్క అయితే చాలు ఒంగి పోయి అన్నీ పనులు చేసిపెడతారు, (డాలరు విలువ కూడ కోతిలా ఆడిస్తుంది)..




ఏది ఏమైనా పరిమితులు దాటితే గతి తప్పినట్టే, చిన్నప్పటి నుండి ఎంతో ఆప్యాయమైనా ఆటకి దుస్తితి కలుగుతుంటే చాలా బాధగా వుంది.ఈ తతంగంలో నాకు నచ్చినధి మన క్యాప్టెన్ అనిల్ వ్యాఖ్య. తన తీరుకి, పదవికి పరిణితి వున్న వ్యాఖ్య.


బక్నర్ బాబాయ్ ని ఏమి అనదలుచుకోలేదు , ఎందుకంటె పిలిచి డాలర్లు ఇస్తాం నిల్చో అంటే , బెల్ట్ బిగించుకొని వచ్చేసాడు పాపం, తనకి మాత్రం ఏమి తెలుసు 67 సం" కూడ తనకి వినిపిస్తుందని , కనిపిస్తుందని (అదీ వరుసగా 5 రోజులు ) అందరూ ఇంకా 'ఆసీ 'స్తున్నారని.


ఒక రకంగా భజ్జీ కేసు వాళ్ళకే ఎసరు , నోరు మూసుకొని అవతల వాడిని కదిలించకుండా ఆడే అలవాటు ఆసీలకి లేదు , ఇక ఎప్పుడు నోరు విప్పిన తవ్వుకొన్న గోతిలో పడక తప్పరు !!



సరదాగా ..


వినికిడి ఏమిటంటే బక్నర్ కూడ "జాతి వివక్షత" ఆరోపణ పెట్టనున్నాడని , వ్యాఖ్య చేసిన తర్వాత భజ్జీ ని ప్రక్కకి పిలిచి అడిగాడుట , "నిజం చెప్పు!!! కోతి అని ఎవరిని అన్నావు ??" వెంటనే భజ్జీ తన స్తైల్ లో అడిగాడుట " నిజం చెప్పు బాబాయ్ కనపడక అడుగుతున్నవా ?? లేక వినపడక అని??" :-)


చివరిగా మ్యాచ్ రిఫరీ , కోతి వెదవ కాకపోతే అసలే మ్యచ్ లో బాల్ బ్యాట్ ని తాకిందొ, ఏది ప్యాడ్ ని తాకిందో తెలియక అంపైర్లు తికమక పడుతుంటే మద్యలో పిలిచి ఓవర్లు మద్యలో వాళ్ళిద్దరు ఏమి పోట్లాడుకొన్నరు అని ఆడిగితే , ఏమో మాకు తెలీదు పాంటింగ్ ని అడుగు అనక ఇంకేమి చెపుతారు.




ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు కోతి కధలు , బోలెడు కోతి చేష్టలు ..

మొత్తానికి గత 7 నెలలుగా బ్లాగకుండా వున్న నన్ను కదిలించారు ఈ కోతి వెధవలు..

Saturday, May 05, 2007

సరదా తెలుగు

రానారె రాసిన తెలుగు నుడికారాలు (పొద్దు లో ) http://poddu.net/?p=97 చదువుతుంటే కొన్ని సరదా సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఇవి నుడి'కారాలు' అనవచ్చో లేదో వివిద ప్రాంతాలలో వాడుక భాష అంటారో తెలియదు..

ఒకసారి హైదరాబాద్ లో నా స్నేహితుడు తన బందువుల వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. (వాడికి అప్పుడే పరిచయం.. ఎవరో వేలు విడిచిన మేనమామ తాలూక అనుకొంట .. వాడికే మొహమాటం ..వాడికి నేను ఇంకొక మొహమాటపు [ బలవంతపు] తోడు )..కాస్త మాటలు అయి 'టిఫినీలు తిన్నారా .. కాఫీలు తాగారా..' అయిన తర్వాత , ఎవరూ పరిచయం లేక పోయిన అన్ని మాటలకి 'ఊ' కొడుతున్ననా పరిస్ఠితి అర్దం చేసుకొని వాడు ఇక బయలుదేరటానికి నిశ్చయించుకొన్నాడు.మళ్ళీ వాడి బుద్ది మారే లోపల బయట పడటం మంచిదని నేను కాస్త ముందు బయటపడ్డా..అయితే వీడు మాత్రం వాళ్ళ ప్రహరీ గేట్ దగ్గర నిల్చొనివున్నాడు. ఏమిరా అని అడిగితే .. 'వాళ్ళూ వస్తారట నన్ను వుండమని చెప్పారు' అని అన్నాడు. ఇంకా విముక్తి లేదన్నమాట అనుకొని కాసేపు బయట వేచివున్నాము.ఎంతకీ ఎవరూ రారు .. వెళ్ళి కనుక్కోరా బాబూ అంటే . వాడు వెళ్ళి అట్నుంచి ముసి ముసి నవ్వులు నవ్వుతూ వచ్చాడు..విషయం ఏమిటంటే .. 'వెళ్ళొస్తానండి' అని మన వాడు అంటే ఆవిడ 'వస్తావుండు బాబు' అన్నారట.. అంటే 'అప్పుడప్పుడు వస్తూ వుండు' అని అర్ధం. మా హీరో కి '(నేను)వస్తాను.. వుండు బాబు' అని అర్ధమైంది... అదన్నమాట..మరి చెప్పటానికి ఏముంది .. అప్పటికే ఆలస్యం అవుతుంది అని వాడిమీద వున్న కోపం అంతా ఒక్కసారి మాయమైంది.
అసలు హాస్టల్ వుండి చదువుకొంటే ఆ మజానే వేరు. .. అన్ని ప్రాంతాల వారు వస్తారు..అన్ని రకాల వాడుక పదాలు తెలుస్తాయి.ఒక్కొక్క సారి నవ్వులతో ముంచెత్తుతాయి.. నేను 10th క్లాస్ లో తరగతి లీడర్ గా వెలగ బెట్టిన రోజులవి. మాకు కృష్ణా జిల్లా నుంచి అనుకొంట ఒకాయన హెడ్మాస్టర్ గా వుండేవారు. ఒకసారి ఆయన 'ఒరేయ్ లెక్కల మాస్టరు పరీక్ష పేపర్లు 'ఎత్తుకొని' వెళ్ళాడ... అని అడిగారు.. కోస్తా జిల్లాలలో 'ఎత్తుకు పోవటం' అంటే దొంగిలుంచుకొని వెళ్ళటం అని వాడుక.అలా అర్ధమై ఆయనేదో సరదాగ అడుగుతున్నారని నేను నవ్వుతున్నాను.(అసలు దొంగిలించాల్సిన అవసరం ఆయనకేంటి అని ఆలోచిస్తూ..)ఆయన కాస్త సీరియస్ 'ఏం నువ్వు చెప్పటం మర్చిపోయావా..' అని అరవగా అప్పుడు ఆయన అభిమతం ఏమిటొ అర్ధమైంది.
ఒకసారి ఒక రాజమండ్రి ప్రాంతం అబ్బాయ్ గ్లాస్ పట్టుకొని (నేను నీళ్ళ జగ్ పట్టుకొని వున్నాను).. తను ఇచ్చుకో అన్నాడు.. నీళ్ళు అనుకొని తన గ్లాస్ లో పోసా..మళ్ళీ ఇచ్చుకో అన్నడు.. మళ్ళీ నీళ్ళు పోసా... చివరికి అర్దమైంది . వాళ్ళ వాడుకలో 'ఇచ్చుకో' అంటే 'పట్టుకో' అని..ఇలా చెప్పుకొని పోతే కుప్పలు.. కుప్పలు.. సరదా తిప్పలు... అసలు అన్ని ప్రాంతాల తెలుగు భాష ప్రయోగం తో సరదాగ ఎవరైనా వ్యాసం రాస్తే బావున్ను.. (హాస్యం వరకే సుమా.. అపహాస్యం కి కాదు).

Saturday, April 28, 2007

క్రికెట్ ఆస్ట్రేలియా - ఒక తెలుగు సినిమా..

కొన్ని కొన్ని సినిమాలు చూసి , సామాజిక పరిస్థితులకు ఎంత దగ్గరగా వున్నాయో అని అనుకొంటాము।

మరికొన్ని సార్లు కొన్ని సంఘటనలు సినిమా ఫక్కీలో జరిగుతున్నాయనిపిస్తుంది।ఆలానే ఈ ఆస్ట్రేలియా క్రికెట్ ఒక సినిమా కధలా వుంది। ముగింపు ఎప్పుడూ ఒక్కటే ఒక హీరో , హిరోయిన్ (అప్పుడప్పుడు ఇద్దరు, ముగ్గురు వుంటారులేండి హీరో size ని బట్టి)ఇద్దరి మధ్య ఎన్నేన్నో సంఘటనలు కాని చివరికి ఇద్దరు కలుస్తారు , పెద్దవాళ్ళు పెళ్ళి చేస్తారు।శుభం అవుతుంది ...ఇలా ఎన్ని సినిమాలు తీసినా చివరికి శుభం ఏమవుతున్నదో తెలిసినా కూడా అదొక ఆశక్తితో సినిమా అంతా చూస్తాము।

అలానే ఆస్ట్రేలియా ఆడబోయే సిరీస్ లు అన్నీ అదే రకంగా ఏడ్చాయి। ఈ వరల్డ్ కప్ తో సహా...

ఇక్కడ ఆస్ట్రేలియా లో వుంటూ, వాళ్లు ఓడిపోవాలని కోరుకోవటం తప్పేమో గాని, వాళ్ళు గెలిస్తే క్రికెట్ ఆట మీద ఆశక్తి లేకుండా పోతుంది। ఇది నా మాట మాత్రమే కాదు ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళది అదే అపరిస్థితి।వాళ్ళ న్యూస్ చాన్నళ్ళలో కూడ క్రికెట్ కి అంత ప్రాముఖ్యత లేదు. అసలు వీళ్ళు ఇండియా లో వుండి వుంటే అక్కడ మన మిచ్చే ప్రాధాన్యతకి ఉబ్బి తబ్బిబ్బయి మన టీమ్ లానే సూపర్ 8 కి కూడ వచ్చివుండే వారు కాదేమో ॥

ఒకసారి Sydney cricket grounds లో నేను చూసిన మ్యాచ్ లో శ్రీలంక , ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించింది .అదే ఆశ తో మళ్ళీ ఈ రోజు మ్యాచ్ పూర్తిగా చూద్దామని నిశ్చయించుకొన్నాను.కనుక నేను చూస్తుండగా ఆస్ట్రేలియా గెలిచే ప్రసక్తే లేదు ...(ఎందుకంటే హేడెన్ , పాంటింగ్ పిచ్ మీద నృత్యాలు మొదలుపెడితే ఇక మళ్ళీ చూడలేక ఆపేయటమే కదా.. సినిమా లో హిరో అదే స్టెప్ లు వేస్తుంటే ఎన్ని పాటలని చూడగలం , కీరవాణి music laaga). అదేదో Learn cricket by -Ricky & team, video CD చూస్తున్నట్టు అనిపిస్తుంది.
బహుశా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ఓడిపోతే మంచిది। ఎవరికోసమో కాదు , వాళ్ళకోసం , క్రికెట్ ఆట కోసం, లేదంటె ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చూడటానికి ఎవరూ రారు , TV చాన్నళ్ళు కూడ ప్రాసారాలికి పోటీ పడకపోవచ్చు।ఏమిటొ మరీ ఇలాంటి పరిస్థితి వస్తుందనో ఏమో Azhar బెట్టింగులు కి వెళ్ళేవాడొ ఏమో పాపం అందరూ తప్పుగా అనుకొన్నారు।అంత దూ(దు)ర దృష్టి పాపం ఇప్పుడు ఎవరికి లేదు కదా !!


అయినా రెండు 'జయ'లు (జయ సూర్య, జయ వర్ధనే)విజృంభించితే విజయం లంకను వరించకపోదా ॥

ALL the best to Lankans॥ Best of luck to Cricket।

అవునట్టు ఈ మద్య Astrologers ఎవరూ ఏ team గెలుస్తుందో పెద్దగా మాట్లాడుతున్నట్టు లేదు. కష్టమే కదా..ఆస్ట్రేలియా గెలుస్తుంది అని చెబితే , మీరు చెబితే గాని తెలీదా అంటారు. పోనీ శ్రీ లంక అని చెప్పాలంటే చాలా risk తీసుకోవాలి. అందుకే అందరికి సమ్మతమైనట్టు జయవర్దనే ఎడమ కన్ను అదరకుండా వుంటే గెలుస్తుంది అని చెబితే సరి.

Saturday, April 07, 2007

గత కాలం నాటి కవిత - 2

మనసు ఉల్లాసంగా వున్నప్పుడు మదిలో ఏవో భావాలు మెదిలి, నాలిక మీద కదులుతున్న నాలుగు పదాలను కుదురుగా కూర్చి ప్రాస పూతను పూస్తే మంచి కవితగా మారుతుందని నా అనుభవం , అభిప్రాయం।

అయితే ఈ క్రింద వుంచనున్న నాలుగు పంక్తులు ఏ వర్గం లోనికి వస్తుందో తెలియదు , అసలు తన మనస్సుకి స్పృసించిన సందర్భంలో కవిగారికి ఆ ఆలోచన వచ్చే ప్రసక్తే లేదనుకొండి।
ఇక విషయానికి వస్తే , మా నాన్నగారు తన చిన్నప్పుడు రచించి ప్రచురితమైన కొన్ని కవితలని భ్లాగులో వుంచే ప్రయత్నంలో అడిగితే తను చెప్పిన నాలుగు మాటలు॥

అవి 1950సం,, వారి గ్రామంలో రెండు ఏళ్ళుగా వర్షాలు , పంటలు లేక చాలా కుటుంబాలకి తిండి కూడ కరువైందట. వీళ్ళ ఇంటిలో వండిన అన్నం గంజి కోసం చాలా మంది కాసుకొని వుండే వారట..
కొన్ని ప్రాంతాలకి రంగూన్ నుంచి తెప్పించిన ఎరుపు బియ్యం లభించేదట॥ అక్రమాల వలన అవి కూడ అందరికి అందేవి కాదట। ఆ పరిస్థితులలో తనకి ఆవేదనతో కదిలిన భావాలు నాలుగు పంక్తులలో॥

కష్టాలే కలకాలం కాపురాలు చేయాలా??
ఎన్నాళ్ళూ కాలువలై కన్నీరే పారాలా ??
ఆనందాలు అధోగతిని అణిగిపోయి వుండాలా??
మోసంపై దినం దినం మోజు పెరుగుతుండాలా ??
అవునట్టు ఇవి ఏ పత్రికలో లోను ప్రచురితం అవలేదు కాని తన మనస్సులో మాత్రం ముద్రించబడి వున్నాయని తన మాటల్లో తెలుసుకో గలిగాను॥
అప్పటికి , ఇప్పటికి కాలచక్రం అయిదు పదులు తిరిగింది , పరిస్థితులు రూపులు మారి సమస్యలు కొత్త వేషం దాల్చాయి। ఎటుపోతున్నమో తెలుసుకొనే తీరిక లేదు, ఇక దానిపై విశ్లేషణ సరేసరి।
నిజానికి బ్లాగుల పుణ్యమా అని మరుగుపడుతున్నభాష అయిన కాస్త మెరుగులు దిద్దుకొంటుంది।

Friday, April 06, 2007

Interesting places - memory snap shots

Coverage of different interesting places in the world including Mumbai, Goa, Hampi & Kerala.
http://homepage.mac.com/inthekitchenwithlisa/PhotoAlbum46.html

Its interesting to know what foreigners capture in our cities..

Sunday, April 01, 2007

గత కాలం నాటి కవిత

మా నాన్నగారు తను ఉద్యోగ ప్రయత్నాల సమయంలో చేసిన కొన్ని రచనలు వారపత్రికలలో ప్రచురింపబడ్డాయి।
అవి ఇప్పుడు చదువుతుంటే అప్పటి కాలం నాటి స్ఠితిగతులు , వాళ్ళ భావావేశాలు తెలుస్తుంటాయి। వాటిలో కొన్ని సేకరించగలిగాను. మచ్చుకకి ఒకటి।

ఇప్పటి తరంకి అంతగా పట్టవు వద్దు అని తను వారించినా మన కూడలి లో కొన్ని మంచి టపాలు తనకి చూపించి మరి ఒప్పించాను। అప్పటిలో గ్రామపంచాయతీల ఏర్పాటు, పంచశీల పదకాల మీద॥

1965 వాణి పత్రికలో ప్రచురితమైన కవిత॥

ఆశలూ - ఆశయాలు

అతి సు౦దర స్వప్నాలను
కనులము౦దు గా౦చుతాను
నా దేశపుటున్నతికై
నా మాటలు పలుకుతాను !

నా దేశ౦! నా ప్రాణ౦ !
రె౦డిటికి లేదు భేద౦ !
సమభావపు టౌన్నత్య౦
పెరగాలిక ప్రతినిత్య౦!

అభేద్యమౌ సమస్యలకు
అ౦తు చిక్కి పోవాలి !
తరతమ భేదాలన్నవి తరలి పారిపోవాలి !
ప౦చశీల సూత్రాలను పదిమ౦దికి తెలియజేసి,
వ౦చనలకు తావు లేని మ౦చి రధ౦ నడపాలి !

పల్లెసీమ పాడి ప౦ట ప౦చాయతి పె౦చాలిక !
పట్టణాల భాగ్యానికి పరిశ్రమలు పెరగాలిక!
దురాక్రమణ దుష్టశక్తి దూరానికి జరగాలిక!
ఆకలి యాక్ర౦దనలు అలసి పారిపోవాలిక !

ఆనాడే నా కమ్మని ఆశయాలు ఫలిస్తాయి!
నా దేశ౦ నానాటికి నాక౦లా మారుతు౦ది!

ఈనాడు దిగజారుతున్నదా ??

ఏమి మీకు ఇంకా సందేహమా అని అడుగుతారేమో ??
నాకు ఊహ తెలిసినప్పటినుంచి దినపత్రిక రంగంలొ సంచలనాలు రేపుతూ , జర్నలిజంని క్రొత్తపుంతలు తొక్కించి ఆంధ్రావనిలో ఎదిగి ప్రక్క రాష్త్రాలకి కూడ విస్తరించిన ఈ దిగ్గజం ఇప్పుడు కేవలం "రామో"జికీయం గా మారుతుంది।
కేవలం రాజశేఖర రెడ్డి తో వచ్చిన విభేధాలతో శ్రుతి , గతి తప్పుతుంది.
ఇంతవరకు ఎవరకి అవసరం లేనివి , తెలియనవి వెలికితీసి మరీ మొదటి పేజీలో వేస్తున్నారు। అంత అన్యాయం జరుగుతుంటే ఇంత వరకూ నిద్రపోతున్నరా?? లేకపోతే అవసరం రాలేదా??

చివరికి వెర్రిమొహాళ్ళగ రాష్ట్రమంతా ప్రతీరోజూ పత్రిక కొనుక్కోని మరీ, సీరియల్ లాగా వాళ్ళిద్దరి తగువులు చదవాల్సిన
గతి పట్టింది। ఎలాగు ఆ విభేధాలు ఇంతలోగా తేలవు గాని జిల్లా ఎడిషన్ లాగ దీనికి ఒక ఎడిషన్ మొదలుపెడితే సరి। అది ప్రక్కన పడేసి మిగత వార్తలేమిటొ చదువుకోవచ్చు।
ऑनलाइन లో చదవటానికి ఇంత చిరాగ్గావు వుంది। పాపం రోజు కొనుక్కొని చదివే వాళ్ళగతి ఏమిటో ??
అసలు పత్రికా రంగంలో గట్టి పోటి లేక ఈ దుర్గతి।

Friday, March 30, 2007

రామాయణం , మహాభారతం - శ్రీ ఉషశ్రీ స్వరంలో

తింటే గారెలు తినాలి , వింటే భారతం వినాలి , అదీ మన ఉషశ్రీ గారి స్వరంతో...

రామాయణం , మహాభారతం పెద్దగా పరిచయం లేకపోయిన ఒక్కసారి విన్నారంటే చాలు॥
ఇతిహాసాలని ఇంత బాగా కధలా చెప్పవచ్చు అని తెలుస్తుంది। ఇక ఆలస్యం ఎందుకు, విని ఆనందించండి।

రామాయణం

మహాభారతం

Thursday, March 29, 2007

హలో భవ్య - ఏమిచేస్తుంది ??


ఏమిటి చెప్మా నాన్న తన బ్లాగులో నా తపా ఇంకా చూసుకోలేనట్టుంది ??ఇంకా ఏమి అడగలేదు ??
అయినా చిన్నప్పుడు ఏమి చేసిన చెల్లుతుంది॥ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి మరి। :-)

Sunday, March 25, 2007

హలో from భవ్య

హలో .. నా పేరు భవ్య సాయి సంజన (అని మా నాన్న, అమ్మ చెప్పేరు.. నాకు నచ్చిందో లేదో నా భాష మీకు అర్ధమైనప్పుడు చెప్తా .. )
నాకు మాటలు ఇంకా రావని వీళ్ళ౦తూతారు. అసలు నా భాష వీళ్ళు చిన్నప్పుడు మాత్లాడినా ఇప్పుడు మర్చిపోయారు. దానికి మరి నేనేం చేయను.

మా నాన్న ఈ మద్య "కూడలి" అనే ప్రపంచంలో ఎక్కువుగా తిరుగుతున్నాలని విని , ఏమిటో చూద్దామని ఇలా వచ్చా!!! అమ్మోయ్ , 'అమ్మ' మాత్రమే లోక౦ అనుకొన్నా కాని ఇన్ని రకాలుగా వుంటుందని తెలియదు. నాకు నచ్చిన బొమ్మలు అయితే మరి ఎక్కడ కనిపించలేదు.

కొన్ని బ్లాగులు చూసిన తర్వాత తెలిసింది , తెలుగు, సంస్కృతి, క్రికెత్, రాజకీయం, లాజశేఖర రెడ్డి, తెలంగాణ, రుచికరమైన వంత, అమెరికా,బ్లాగటం మొదలైనవి లేకుండా ప్రపంచం లేదని. కొన్ని పదాల అర్ధాలైతే మీ భాష నేర్చుకొన్నాక అడగాలని వుంది . అర్దం చెప్తారు కదూ..

చాలా మంది అంకూల్స్, ఆంటీలు రాసినవి చూసి ఒకటి మాత్రం తెలిసింది మా నాన్నకి రాయతానికి బద్దకమని..సరేలేండి నేనైనా పలకరిద్దామని వచ్చాను కదా...

అవున్నట్టు ఈ మధ్య చుట్టుపక్కల , ఇంటిలో రాత్రి పూట 'అయ్యో వికెత్' 'చెత్త వెధవలు అవుతయ్యరు' , అనే కేకలు తగ్గాయి. ఇక వుండవని కూడా మా అమ్మ చెప్పింది. దీనికి సహాయ పడిన సచిన్, ధోని .. అంకూల్స్ కి , గ్లేగ్ తాతయ్యకి చాలా తాంక్స్.. వాళ్ళు ఎంచక్క వాళ్ళ పిల్లలు, మనువళ్ళతో ఇంటిలో బంతి ఆట ఆడుకోవచ్చు.

మా అమ్మ లేచే వేళ అయి౦ది ఇక వుంట ॥(ఏమిటి నేను ఇంత ముందే ఎలా లేచాననా ॥ ఇదొక మంచి అలవాటని మా తాతయ్య చెబుతూ౦తే విన్నాను। చిన్నప్పుడు మీకు ఈ అలవాటు వుండే వుంటుంది పాపం, భాష లా దానిని పెద్దయిన తర్వాత మరిచిపోవచ్చు అనుకొంటా..!!).

ఇక వుంట తా..తా... బై ..బై.. నా ఫోతో ఎలా వుందో చెప్పండే..