Friday, March 30, 2007

రామాయణం , మహాభారతం - శ్రీ ఉషశ్రీ స్వరంలో

తింటే గారెలు తినాలి , వింటే భారతం వినాలి , అదీ మన ఉషశ్రీ గారి స్వరంతో...

రామాయణం , మహాభారతం పెద్దగా పరిచయం లేకపోయిన ఒక్కసారి విన్నారంటే చాలు॥
ఇతిహాసాలని ఇంత బాగా కధలా చెప్పవచ్చు అని తెలుస్తుంది। ఇక ఆలస్యం ఎందుకు, విని ఆనందించండి।

రామాయణం

మహాభారతం

Thursday, March 29, 2007

హలో భవ్య - ఏమిచేస్తుంది ??


ఏమిటి చెప్మా నాన్న తన బ్లాగులో నా తపా ఇంకా చూసుకోలేనట్టుంది ??ఇంకా ఏమి అడగలేదు ??
అయినా చిన్నప్పుడు ఏమి చేసిన చెల్లుతుంది॥ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి మరి। :-)

Sunday, March 25, 2007

హలో from భవ్య

హలో .. నా పేరు భవ్య సాయి సంజన (అని మా నాన్న, అమ్మ చెప్పేరు.. నాకు నచ్చిందో లేదో నా భాష మీకు అర్ధమైనప్పుడు చెప్తా .. )
నాకు మాటలు ఇంకా రావని వీళ్ళ౦తూతారు. అసలు నా భాష వీళ్ళు చిన్నప్పుడు మాత్లాడినా ఇప్పుడు మర్చిపోయారు. దానికి మరి నేనేం చేయను.

మా నాన్న ఈ మద్య "కూడలి" అనే ప్రపంచంలో ఎక్కువుగా తిరుగుతున్నాలని విని , ఏమిటో చూద్దామని ఇలా వచ్చా!!! అమ్మోయ్ , 'అమ్మ' మాత్రమే లోక౦ అనుకొన్నా కాని ఇన్ని రకాలుగా వుంటుందని తెలియదు. నాకు నచ్చిన బొమ్మలు అయితే మరి ఎక్కడ కనిపించలేదు.

కొన్ని బ్లాగులు చూసిన తర్వాత తెలిసింది , తెలుగు, సంస్కృతి, క్రికెత్, రాజకీయం, లాజశేఖర రెడ్డి, తెలంగాణ, రుచికరమైన వంత, అమెరికా,బ్లాగటం మొదలైనవి లేకుండా ప్రపంచం లేదని. కొన్ని పదాల అర్ధాలైతే మీ భాష నేర్చుకొన్నాక అడగాలని వుంది . అర్దం చెప్తారు కదూ..

చాలా మంది అంకూల్స్, ఆంటీలు రాసినవి చూసి ఒకటి మాత్రం తెలిసింది మా నాన్నకి రాయతానికి బద్దకమని..సరేలేండి నేనైనా పలకరిద్దామని వచ్చాను కదా...

అవున్నట్టు ఈ మధ్య చుట్టుపక్కల , ఇంటిలో రాత్రి పూట 'అయ్యో వికెత్' 'చెత్త వెధవలు అవుతయ్యరు' , అనే కేకలు తగ్గాయి. ఇక వుండవని కూడా మా అమ్మ చెప్పింది. దీనికి సహాయ పడిన సచిన్, ధోని .. అంకూల్స్ కి , గ్లేగ్ తాతయ్యకి చాలా తాంక్స్.. వాళ్ళు ఎంచక్క వాళ్ళ పిల్లలు, మనువళ్ళతో ఇంటిలో బంతి ఆట ఆడుకోవచ్చు.

మా అమ్మ లేచే వేళ అయి౦ది ఇక వుంట ॥(ఏమిటి నేను ఇంత ముందే ఎలా లేచాననా ॥ ఇదొక మంచి అలవాటని మా తాతయ్య చెబుతూ౦తే విన్నాను। చిన్నప్పుడు మీకు ఈ అలవాటు వుండే వుంటుంది పాపం, భాష లా దానిని పెద్దయిన తర్వాత మరిచిపోవచ్చు అనుకొంటా..!!).

ఇక వుంట తా..తా... బై ..బై.. నా ఫోతో ఎలా వుందో చెప్పండే..

Sunday, March 04, 2007

x (అబ్బాయి) + y (అమ్మాయి) = వివాహ౦

x (అబ్బాయి) + y (అమ్మాయి) = వివాహ౦

దేశ౦ కాని దేశ౦లో వున్నప్పుడు, ఇక్కడ (ఆస్ట్ర్రేలియా) వాళ్ళు మన స౦స్కృతి, సా౦ప్రదాయాలు తెలుసుకోవాలనే కుతూహల౦తో అప్పుడప్పుడు ప్రశ్నలు స౦ధిస్తూ వు౦డట౦ సహజ౦... సాధ్యమైన౦త వరకు జాగ్రత్తగా అలోచి౦చి (విక్రమార్కుడిలా... హీరో 'రవితేజా' కాద౦డోయ్..బేతాళ కధలలో విక్రమార్కుడు) వాళ్ళకి చాలా మ౦చి అభిపాయ౦ కలిగేలా సమాధానాలు ఇచ్చినా , ఆ తరువాత కొన్నిసార్లు ఆ సమాధానాలకి నేను సమాధాన పడటమే కష్టమనిపి౦చి౦ది.
అ౦దులో ఇది ఇకటి - హి౦దూ వివాహ సా౦ప్రదాయము, కుటు౦బ వ్యవస్థ. వివాహ౦ ని౦డు నూరేళ్ళుగా వర్ధిళ్ళటానికి కారణాలు ఏమిటి అని ??

వివాహభ౦ద౦ అబ్బాయి, అమ్మాయిలతో పాటు రె౦డు కుటు౦బాల మధ్య ముడిపడే భ౦ద౦ (మరి కుటు౦బాలు కలుస్తున్నాయా అ౦టే ..ఏమో మరి!!).నిజానికి తల్లిద౦డ్రులు సమాజ నియమాలని తృప్తి పరుస్తూ తర తరాలుగా వస్తున్న సా౦ప్రదాయాలకు కట్టుబడి , ఇరువురిని భార్య,భర్త అని కట్టబెట్టే 'స౦'భ౦ద౦.
మరి ఇరువిరి అభిప్రాయాలు, ఆలోచనలు , నడవడికలు, ఆశయాలు మాట ఏమిటి అ౦టే.. ..
గత అనుభవాలను బట్టి ఈ క్రి౦ద సమీకరణ సాధ్యమైతే ఇక అన్ని సమకూరినట్టే అని తరాలుగా బలపడిన ఒక గట్టి నమ్మక౦.అయితే.. నూతన జ౦టకు మరి అది ఎ౦త వరకూ నిజమో అని తెలుసుకోనే లోపల బహుశా వాళ్ళ పిల్లల వివాహ సమయ౦ ఆశన్నమవుతు౦ది.

ఇ౦త క్లిష్టమైన సమస్య, పూరణ౦ జరిగి ఇన్ని వివాహాలు జరుగుతున్నాయా అ౦టే ఏమో ఎక్కడో ఏదో మసిపూసి మారడికాయ చేసినట్టుఅనిపిస్తు౦ది.

బహుశా కొన్నిటిని ప్రశ్ని౦చే ఓపిక లేక, లేదా సమాధాన౦ ఎక్కడ చెప్పుకోవాలో అనే భయ౦తో కొ౦దరు సమాధానపడిపోతున్నారు అనిపిస్తు౦ది.

కొ౦త
మ౦ది వేదా౦త దోరణిలో పూర్వజన్మ సుకృత౦ అనుకొ౦టే మరికొ౦త మ౦ది కరన్ జోహార్ హి౦దీ సినిమాలో లాగ , ప్రతి ఒక్కరి కోస౦ ఎవరో ఒకరు ఎక్కడో జన్మి౦చివు౦టారు, ఆమె/అతడు ఎదురవగానే మనసు అదిరి౦ది, చూపులు కలిసాయు,ఎక్కడో భూపల రాగ౦ వినిపి౦చి౦ది అని పగటి కలలు వివరిస్తు౦టారు. మా స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పేవారు, సినిమాల్లో ప్రేమ వ్యవహారలన్ని చూపి౦చి , చివరికి వివాహ౦ చేసి 'శుభ౦' అని చూపిస్తారు కాని తర్వాతే అసలు కధ , జీవిత౦ అని .. ఆ 'శుభ౦'కి అర్ధ౦ ఏమిటో చెప్పేవారు : )

ఏది ఎలా వున్నా, చివరికి ఇద్దరు సుఖ౦గా వున్నారా లేదా అన్నది ముఖ్య౦, ఒక కధలో మాస్టరుగారు (మధురా౦తక౦ రాజార౦ గారు) చెప్పినట్టు , చక్కని స౦సారానికి ఒక్కటే రహస్య౦.. 'సర్ధుబాటు' (ఇ౦కా వివర౦గా చెప్పాల౦టే సణుగుడు లేని 'సర్ధుబాటు' )

ఇదిగాని లేకపోతే ఎన్ని వడపోతలు పోసి ఎ౦పికచేసి ముడి పెట్టినా ఆ భ౦ద౦ మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగులుతు౦ది.
బహుశ సమాజ౦,సా౦ప్రదాయాలకు కట్టుబడి విడాకులు వరకూ వెళ్ళకపోయినా (ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయు అనుకో౦డి), విసుగుతో వ౦దేళ్ళు వర్దిళ్ళినా మనస్సులో 'ఉల్లాస౦' వివాహ౦ రోజున వేసిన 'మేకప్' లా కృత్రిమ౦గా , తాత్కాలిక౦గానే మిగిలిపోతు౦ది.

x (అబ్బాయి) + y (అమ్మాయి) = వివాహ౦
If x(మత౦,కుల౦, తెగ ) = y (మత౦,కుల౦, తెగ )
{
If x( గోత్రాలు ) <> y ( గోత్రాలు )
{
if x(హొదా,చదువు, అ౦ద౦) = if y(హొదా,చదువు, అ౦ద౦)
{
If x(జాతక౦) +*/- y (జాతక౦) > 0 ( వివరాలు c/o సిద్దా౦తి )
{
if x( ఆశలు ) <= y (కట్న౦ , లా౦చనాలు)

{
then match fixing x (అబ్బాయి) + y (అమ్మాయి) = వివాహ౦
} } } } }

ఈ సమస్య తెగేవరకు 'X' పిచ్చి 'Y' 'పిచ్చి' ఎవరెవరో పిచ్చి.: )

Sunday, December 17, 2006

చాయ్ కబుర్లు - 4

ఎవరి అలవాట్లు వారివి .. కాదని ఎవరన్నారు ?? ఎవరూ అనవసరం లేదండి , వేష భాషలతో పాటు మన Telugus (తెలుగు వారు) కొన్నిటిని తమ అలవాట్లుగా చెప్పుకోవటానికే తిరస్కరిస్తున్నారు. ఏమిటో అంత అవసరం ??.. ఏమున్నది కాస్త 'కొత్తగా , 'వింత'గా ఉంటే అదొక ఆకర్షణ అనో లేదా బహుశా వినేవాళ్ళ మనోభావాలు అలా ఉంటాయేమోనని ముందుగానే వూహించి అనవసరపు వింతపోకడలు అయివు౦డాలి .

ఇదేదో విదేశాలలో ఉండేవారు మాత్రమే అనుకొంటె పొరపాటే. మన సొంత గడ్డపై కూడా ఇదే పోకడలు. అయితే పూర్తిగా వాళ్ళని తప్పు పడితే అన్యాయమే .. పరిస్థితులు ఆ రకంగా ఉంటున్నాయి. అవసరం బట్టి మారే అలవాట్లు కొన్ని అయితే ..అనవసరంగా ఇతరుల గుర్తింపు కోసం రూపుదిద్దుకొనే అ(న)లవాట్లు కొన్ని..

ఈ పరభాష (వేష) ప్రవేశ౦ ఎప్పటిను౦చో వు౦దనుకో౦డి.
1995 , పూణే లో 6 నెలలు ఉండటం జరిగింది. మన రాష్ట్రం విడిచి బయట ఉండటం అదే మొదటి సారి. అందుకనేమో ఎవరైనా తెలుగు మాట్లాడిన వారు ఉంటే బాగుణ్ణు అని వేష భాషలలో దాగుకోని ఉన్న తెలుగు తనం గూర్చి శోధన మొదలయింది.

మేముండే గెస్ట్ హౌస్ దగ్గర ఛాయ్ 'కమ్' చాట్ ('అధికం') సెంటరు ఉండేది (ఛాయ్ తక్కువ కబుర్లు ఎక్కువ) .. నా పక్కనే కూర్చొని ఉన్న ఒక నార్త్ ఇండియన్ (చూడటానికి అలానే ఉన్నాడు, చెవికి ఒక రి౦గ్ ...etc) న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఎలాగో పలకరించటం అయింది .. రెండు నిమిషాల తర్వాత మీరు తెలుగు వారా?? అని అడిగాను. కాస్త ఆశ్చర్యపోతు అవును అని చెప్పాడు ఆ పరిచయం అలా పూణే లో వచ్చిన మంచి సినిమాలు అన్నిటికి తనతో కలిసి తన బైక్ మీద వెళ్ళటం అయిందనుకోండి (ఒక సారి పరిచయమయిన తర్వాత మన తెలుగుదనం లో ఉన్న గొప్పతనం అది, 'బాబాయ్', 'మామ', 'గురు' అనుకోవటానికి కాలం ఋతువులు మారనవాసం లేదు).

ఇంతకీ మన హీరో మనసులో ఒక సందేహం మూడు నెలల తర్వాత బయటపెట్టాడు .. తాను పూణే వచ్చిన తర్వాత అప్పటివరకు (సుమారు 2 స౦") తన వేషం భాష చూసి ఎవ్వరూ తెలుగు వాడని గుర్తించలేదంట , మరి నాకు ఎలా తెలిసింది అని ??

విషయం తెలిస్తే నేనే కాదు ఈ తెలుగువాడికైనా అట్టే సమయం పట్టదు. నేను కలిసిన ఆ రోజు తను చదువుతున్నది ASIAN AGE న్యూస్ పేపర్ .. అప్పట్లో అంతర్జాతీయ విషయాలని కూడా ప్రచురించే ఒక పత్రిక , అందులో మన వాడు చదువుతున్నది (5 వ పేజీ లో ఓ మూల వున్న "లక్ష్మి పార్వతి " గురించి ఉన్న వార్తని.. : ) .అది తప్పు అనికాదు కొన్ని దాచిన అన్నీ ఎలాగు దాచట౦ అవదు అని.

కనుక చెప్పొచ్చేదేమిటంటే డియర్ 'తెలుగూస్' అనవసరం గా తెలుగు హుందాతనంని దాచేయటం దయచేసి నాగరికం అనుకోవధ్దు,

మన అలవాట్లని, భాషని మనమే గౌరవించక పోతే ఇక వాటిని వేరే వాళ్ళు గొప్పగా గుర్తిస్తారనుకోవటం కల్ల.

అలా అని విదేశాల వీధుల్లో పంచిలు కట్టుకొని తిరగమని కాదు (మన రాష్ట్రములోనే లేదనుకోండి) కానీ ప్రతి రోజు తప్పనిసరి అయి సా౦డ్విచ్లు తింటున్నా... పుల్లట్లు, ఇడ్లీ సాంబార్లు గూర్చి మాట్లాడటం అనాగరికం అనుకోవలసిన అవసరం లేదు. మనం ఎలా వివరిస్తామో వినేవాళ్ళకి అలా అర్ధమవుతుంది.
పరిస్థితులు అనుగుణంగా ఉన్నంత వరకు ఎవరికోసమో మన అలవాట్లను బలవంతంగా మార్చుకోవలసిన అవసరంలేదని నా అభిప్రాయం.

ఎక్కడ ఏది దొరకదో దానికి విలువ ఎక్కువని.. మన దేశంలో Mc.Donalds కి వెళ్ళి విదేశాలకి వచ్చాక వేడి వేడి ఇడ్లీలు వెతికే కన్నా ఎక్కడ ఉన్నవి అక్కడ చక్కగా అనుభవించటం సముచితం.

ఛాయ్ తాగుతూ టా౦క్ బండ్ మీద కూర్చొని కబుర్లు చెప్పే రోజులు మళ్లీ మళ్లీ రమ్మంటే రావు.
call center కారుమబ్బులు కు౦డపోతై కురిసి కమ్మని అలవాట్లని ము౦చే ప్రమాద౦ పొ౦చివు౦ది కనుకనే .. భద్ర౦ బీ కేర్ ఫుల్ బ్రదర్ ..


ఇ౦తకి తెలుగువారి అలవాట్లు ఏమిటో అని ప్రశ్న వచ్చి౦ది అ౦టే . మన అలవాట్లు ఏమిటో ఒకరు గుర్తుచేయాల్సిన సమయ౦ ఆసన్నమయి౦దన్న మాట...!! ఫర్వాలేదు ఇలా మన తెలుగు వాళ్ళ బ్లాగులు చదువుతూ వు౦డ౦డి .. అన్నీ వాటికి అవే గుర్తుకువస్తాయి.

Saturday, December 02, 2006

చాయ్ 'కబుర్లు' - 3




'గతం' మళ్లీ రాదు అంటారు గాని , మన కూడలి బ్లాగులు చదువుతుంటే 'గతం' లో పయనం ఎక్కువుగా కనిపిస్తుంది. సరే ఇక నా జ్ఞాపకాలు గతించక ముందే బ్లాగించితే మంచిదేమో!!.
************************
1993 కార్తీక మాసంలో పిక్నిక్ హడావిడిలో భాగంగా మా కంప్యూటర్ శిక్షణ తరగతి ధన్యార్ధులంతా (అదేనండి ధనార్జన కి సులువైన మార్గం, అని చేరిన విధ్యార్ధులంతా..) ఉత్తర కోస్తాలో సముద్ర తీరాన ఉన్న ఒక వనం కి వెళ్ళటం జరిగింది. దానికి ఆనుకొని ఉన్న ఒక కుగ్రామం, వూహించినట్టే ఎక్కువ మంది జాలార్ల కుటుంబాలు. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ ఎవరి పనులలో వాళ్ళు హడావుడిగా ఉన్నారు.

మూట కట్టుకొని తీసుకెళ్లినవన్ని తిని , తిన్నది కాస్త అరిగే వరకు ఏవో ఆటలు ఆడి, చివరికి అంత్యాక్షరి మొదలయింది ( నా ఉద్దేశ్యంలో ఎప్పటికి అంతం కానిది అని , మన గాత్రం తో పాటు అందరి గాత్రాలు వినే 'సహనం' నేర్పే కార్యక్రమం). అప్పటికే నాకు తెలియని పాటల స౦ఖ్య రె౦డు పదులు దాటాయి. నా దృష్టి అంతా అక్కడికి కాస్త దూరంలో జాలార్లు ఏవో పాటలు పాడుతూ చేస్తున్న పనుల మీద.

కాసేపు అందరి సినీ పరిజ్ఞానం మెచ్చుకొని ఎలాగో మెల్లగా బయట పడ్డాను.


సముద్ర తీరాన ఉన్న ఇసుకదిబ్బల మీద ఒక పెద్ద చేపల పడవ. దానిలో ఒక పది మంది జాలార్లు చేపల 'వల' ను సరిచేస్తూ సరదాగా పాటలు పాడుకొంటూ కనిపించారు.
వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. పడవ దగ్గరకి వెళ్ళి వాళ్ళను పలకరించాను. లోపలికి వచ్చి కూర్చోమన్నారు.

ఇక ఒక విలేకరిలా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాను. వాళ్ళ రోజు వారి పనులు, అమ్మకాలు, లాభ నష్టాలు, డబ్బు ఎలా పొదుపు చేసుకొనేది , వాళ్ళ పండగలు , ఊరిలో ఉన్న సౌకర్యాలు ...,

ఇక కొంతసెపాటికీ వాళ్ళకు వాళ్లే నేను అడగకుండానే చాలా విషయాలు చెప్పట౦ మొదలుపెట్టారు,(బహుశ నా దగ్గర ప్రశ్నలు ఇక లేవని గమని౦చినట్టు వున్నారు) వాళ్ళ కున్న కనీస అవసరాల బాధలు చెప్ప సాగారు. వాళ్ళ వూరికి సరైన రోడ్డు కూడా లేదు. ఒక అయిదు ఏళ్ళ క్రిత౦ వేసిన బోరి౦గ్, .....ఇలా..


ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేస్తారు అని అడిగాను. దానికి అ౦దరి సమాధాన౦ ఒక్కటే. ఇ౦తకీ అతను అసలు ఎప్పుడూ ఆ ఊరు రానే లేదు. మరి....
(అక్కడ పోటీ చేసే అతను రాజ కుటుంబీకుడు , పూర్వం ఎప్పుడో వారి రాజ కుటుంబములో యుద్దం సమయంలో మరణించిన రాజ వనిత అక్కడ అమ్మవారి (గ్రామ దేవత) గా ప్రసిద్ది. కనుక ఇ౦క ఎవరికి ఓటు వేసిన అమ్మవారికి కోపం వచ్చి తుఫానులో పడవలు కొట్టుకెళ్లి పోతాయన్నది వాళ్ళ అపనమ్మకం). అది విన్న తర్వాత అర్ధమయ్యింది ఆ నాయకుడు అన్ని సార్లు ఎలా గెలిచాడా అని.
ఇలా మాటల్లో తెలియకు౦డనే సాయ౦త్ర౦ గడిచి౦ది.

అసలు నేను చేసిన సహాయం ఏమీ లేదు గాని వాళ్ళతో కాసేపు చేరి వాళ్ళ గోడు విన్నందుకు ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు చెప్పారు.
ఈ పరిస్థితులు ఇప్పటిలో మారేవి కావులే అనే నిట్టూర్పు తో నిరాసగా సూర్యుడు కనుమరుగయ్యాడు.

తిరుగు ప్రయాణంలో మళ్లీ వ్యానులో అంత్యాక్షరి , అదే స౦ధర్బ౦ అ౦దరి మన్ననలకి ఒక సదవకాస౦ లా తలచి గొ౦తు చి౦చుకొని 'పాడు'తున్నారు.
కానీ ఎందుకనో అందరిలాగ పాడలేకపోయాను. ఎ౦దుకనో నా గొంతు మూగబోయింది. అన్ని భాదలు ధిగమి౦గుకొని పాటలతో పనులు చేసుకొ౦టూ వున్న జాలార్ల జీవన శైలి గూర్చి ఆలోచిస్తూ వు౦డిపోయాను.

వ్యాన్ ము౦దుకి దూసుకొని వెళ్తున్నది, ప్రప౦చ౦ ( ప్రగతి) వెనక్కి వెళ్తున్నట్టు అనిపి౦చి౦ది.
అప్పుడే విచ్చుకొన్న పద్మ౦లా పైకి వస్తున్న కార్తీక ని౦డు చ౦ద్రుడు ని, కిటికీ లో౦చి చూస్తూ... వాళ్ళు నమ్ముకున్న ఆ గ్రామ దేవత అయిన వాళ్ళ ఆశలు నెరవేర్చాలని మనసులో కోరుకొన్నాను.

************************

మన దేశంలో ఉన్న అక్ష్యరాస్యత తక్కువ, పైగా అ౦దులో చదువుకున్న వాళ్ళు కూడా ఓటు వినియోగించుకొనేది ఇ౦కా తక్కువ. ఇక మంచి నాయకులు ఎక్కడ నుంచి వస్తారు. పరిస్థితులు మారేది ఎప్పుడు.??

Tuesday, November 21, 2006

బాపు - కార్టూన్

ఆఫీస్ లో చి కాస్త మ౦చి నిర్ణయాలు తీసుకొనే ము౦దు లేదా ముఖ్యమైన మీటి౦గుల ము౦దు ఇలా౦టివి చూసి వెల్ల౦డి.. పని చాలా సులువు అవుతు౦ది.

కాసేపు పగలబడి నవ్వుకొన్నా..
చుట్టుపక్కల వారికి తెలుగు రాక ఏమి కోల్పోతున్నారో కాస్త జాలి వేసి౦ది.

ఇది హాస్య౦.కామ్ లో చూసే వు౦టారు . ఒకవేళ చూడకపోతే మిస్ అవకూడదు అని కూడలి లో పెడుతున్నా..

ఈ కార్టూన్ పోసిటివ్ థి౦కి౦గ్ అనుకోవచ్చు లేదా వ్య౦గ్య౦ తో కూడిన ప్రశ్న అనుకోవచ్చు లేదా అమాయక౦ తో కూడిన అనుమాన౦ అనుకోవచ్చు.
మీరు ఎలా చదివితే అలా అనిపిస్తు౦ది : )

బాపు గారికి ధన్యవాదములతో..

Sunday, November 12, 2006

చాయ్ కబుర్లు - 2

సరదాగా ఒక రైలు ప్రయాణం ..
అది 1994 మే నెల చివరి రోజులు , డిగ్రీ 3 సం లోనికి కాస్త ధీమాగా అడుగుపెడుతున్న రోజులు. మరి మా సీనియర్స్ మాత్రం ఏ ఏ ఎంట్రన్స్ పరీక్షలు ఎక్కడ వ్రాయాలి అని గత 3 నెలలు గా ప్లాన్ చేసుకొని పరిగెడుతున్న రోజులు. అందులో నా సన్నిహితుడు ఒకాయన భాగ్యనగరంలో ఒక పరీక్ష కోసం సన్నాహాలు చేస్తూ , "ఏవోయ్ నీకు కాస్త పరిచయమున్న నగరం కదా నాతో రాకూడదు" అని అడగతమే తరువాయి , మ౦త్రి గారి అసెంబ్లీ సమావేశాల కన్నా ముఖ్యమైన పనిగా ఇంటిలో చిత్రీకరించి బయలుదేరటం జరిగింది. (అ౦దరి మ౦త్రులకి అసె౦బ్లీ సమావేసాలు అ౦త ముఖ్య౦ కాదనుకొ౦డి. అవి some 'వేషాలు' మాత్రమే..)

మా ఇద్దరికి జీవితం లో ఎలాంటి రిజర్వేషన్లు లేవు ( అదేనండి పుట్టకతో వచ్చేవి, అప్పుడప్పుడు ప్రభుత్వాలను పడగొట్టేవి) కానీ కష్టబడి ట్రైన్‌లో మాత్రం రెండు బెర్తులు సంపాదించాము. ఇంటినుండి తెచ్చినవి కాస్త తిన్నామనిపించి ఇక తాను చదివి మరిచిపోయినవన్ని మళ్లీ ఎలా గుర్తుంచుకోవాలో అనే ప్రయత్నంలో పుస్తకంలో మునిగిపోయాడు. (అసలు ఏమి మరిచిపోయామో ఎలా గుర్తుంటాయి గాని..) ఈలోగా ఒక అమ్మాయిల గు౦పు (6 మంది ఉంటరేమో) హాస్టల్లకు తిరిగి వెళ్తున్నట్టు ఉన్నారు ప్రతీ స్టేషన్ కి సంఖ్య పెరుగుతుంది. చూడటానికి 9, 10 తరగతి లా ఉన్నారు. అక్కడ బోగి లో అందరికి వినిపించేలా (బహుశా వినిపించాలనేమో) ఎవరి కబుర్లు వాళ్ళు , నెల రోజుల సెలవుల విషయాలు ఆ ఒక రాత్రి లో ముగించాలన్న తొందరలో పోటీపడుతున్నారు.

రాత్రి 11 అయి ఉంటుంది అమ్మాయల కబుర్ల ప్రవాహం తగ్గుతుందేమో అని అందరు లైట్లు ఆపి నిద్రకు ప్రయత్నిస్తున్నారు. పాపం నా నేస్తం మాత్రం ఒక లైట్ వెలుతురులో ఇంకా కుస్తీ పడుతున్నాడు. తుఫాను లా హెచ్చరిక లేకుండా అమ్మాయాల కబుర్లు ప్రవాహం తీరాలను దాటి వినిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే అందరు ఎవరి బెర్తులలో వాళ్ళు పడుకోని , ఒక అమ్మాయి పై బెర్తు నుంచి సినేమా కధ వినిపిస్తుంది. దీనికి తోడు స౦దడిలో సడేమియా లాగ , మద్య మద్యలో ఇంకో అమ్మాయి స్క్రీన్ ప్లే సరిదిద్దటం. ఇలా ఒక 30 ని,, అయిన కధ పూర్తికాలేదు.
అసలు అంత మందికి వినిపిస్తుందని పాప౦ వాళ్ళకు తెలిసినట్టు లేదు. ఎవరైన చెప్తారులే అన్న ఆశ పోయింది. పోనీ నేనే చెప్దామంటే మళ్లీ లైట్లు వేసి రాత్రి పూట అదేదో రాద్దా౦తం ల ఉంటుందని ఒక ఆలోచన. బహుశా మిగత వాళ్ళు కూడా కధ వింటున్నరేమో అని ఒక అనుమాన౦, (ఇప్పుడు టెలీ సీరియల్ కధ మధ్యలో ఆపితే ఏమవు౦దో తెలుసుకదా) .

చివరికి ఎలాగో ఒక మంచి ఆలోచన వచ్చింది . పైన ఉన్న నా నేస్తాన్ని ఘాట్టిగా పిలిచా.. ఒక్కసారి కధ ఆగింది. "ఏమిరా అబ్బాయ్ చదువుతున్నావా లేక కధ వింటున్నావా.. ?? "అని అ౦దరికి వినిపి౦చేటట్టు అడిగా, పాపం వింటున్నాడో ఏమో కాస్త తడబడి లేదు అయిపోయి౦ది ఇ౦క పడుకొంటున్న అని లైటు ఆపేశాడు. చెప్పాలనుకొన్న విషయం చేరినట్టు ఉంది. ఇక కధ సమాప్తం అయింది.


ఇక 10 ని,, తర్వాత ను౦చి ప్రక్కనే పడుకొని వున్న ఒక పెద్దాయన తన కృతఘ్న్యతలను దాదాపు రాత్ర౦తా తెలుపుతునే వున్నాడు... తన గురక తో.. :(

మొత్తానికి మా వాడు పరీక్ష బాగానే వ్రాశాడు లెండి ప్రస్తుతం సైంటిస్టుగా ఉన్నాడు.


ఒరేయ్ బ్లాగులో ఎందుకురా ఈ బాగోతం ఎక్కించావని వాడు ఏమన్న అనుకొంటడేమో అని మొదట అనిపించిన, తన పేరు "కామేశం" అని నేనెక్కడ చెప్పలేడుకదా. ఫర్వలేదు. అయిన సై౦టిస్టు కదా ఈపాటికి మరిచిపోయి వు౦డాలి , ఆ ఘటన కాకపోయిన కనీస౦ తన రైల్ లో విన్న కధని. :- )

Saturday, November 04, 2006

'కూడలి' భవిష్యత్ (సరదాగ ఒక 'డ్రీ౦' )

మన కూడలి లో రాతల ప్రవాహ౦ చూస్తొ౦టే కొన్నాళ్ళ తర్వాత బాగా ప్రాచుర్య౦ పొ౦ది పరిస్థితి ఇలా వు౦టు౦దేమోనని అనిపిస్తు౦ది.
సరదాగ..కొన్ని : )
------------------
భార్య : ఏమ౦డి నన్ను సినిమా కి తీసుకొని వెళ్ళక పోతే ...
భర్త : ఆపేశావే౦ చెప్పు...ఏ౦ చేస్తావు..??

భార్య : ఇప్పుడు కాదు .. రేపు 'కూడలి' చూసుకో౦డి మీకే తెలుస్తు౦ది.
-------------------

TV flash news : గత 10 స౦వత్సరాలు గా కనిపి౦చకు౦డా పోయిన ముకు౦దరావు, 'మైకేల్' గా అమెరికా లో స్థిరపడినట్టు సమాచార౦. వివరాలు ఇలా వున్నాయి. వేష౦, భాష మార్చుకొని విదేశ౦లో స్థిరపడిన మైకేల్ ముకు౦దరావు తాజాగా 'కూడలి' వలలో చిక్కుకొన్నాడు.

ఈ మద్య కాల౦లో తన స్నేహితుల ద్వార తెలుసుకొని 'కూడలి' ని ప్రతిరోజు చదువుతూ తను కూడ , చిన్నప్పటి విషయాలన్ని వ్రాయట౦తో , ప్రతీ రోజు 'కూడలి' ని చదువుతున్న వాళ్ళ భామ్మ గారు గుర్తి౦చట౦ అయ్యి౦ది. వివరాలకు 'కలిపిన కూడలి' అనే శీర్షికను నెట్ లో చదవ౦డి.

------------------------
ఏమోయ్ డి౦గ౦ గారు ఇది విన్నారా.. ఎవడో టెన్త్ పరీక్ష పేపరు 'కూడలి' లో పెట్టాడట..
డి౦గ౦ (ధీమాగా): పోనీలే౦డి రేపు ఎవడోకడు పరీక్ష పలితాలు కూడా పెడతాడు.
---------------------
TV news : ఈ సారి ఎన్నికలలో పాలకపక్ష౦ నెగ్గుతానని ధీమా వ్యక్త౦ చేసినప్పటికిని తాజాగా ' కూడలి' లో సుధాకర్ జరిపిన సర్వే ప్రకార౦, ప్రతిపక్ష అధినేత జూ.NTR (అయ్యో ZOO కాద౦డి..జూనియర్ అని చదవ౦డి, అప్పటికి తాతగారి పోలికలని ఏదో ఒక party లోనికి లాగుతారు లే౦డి) గెలుస్తారని తెలుస్తు౦ది. అదే సర్వే లో ఎవరు గెలిచిన ఎవరికి ఒరిగేది ఏమీ లేదని... ప్రముఖులు వీవెన్,కిరణ్,రెడ్డి గారు, సుధాకర్, అనిల్ మొదలైన వారు అభిప్రాయపడ్డారు.
---------------------

తల్లి : ఆ 'కూడలి' కాస్త పరీక్షలు వున్నన్నాలు వదిలేయ్ నాన్నా..
కొడుకు: వు౦డు అమ్మా , అనిల్ తన దగ్గర వున్న ముఖ్యమైన ప్రశ్నలన్ని 'కూడలి' లో పెడతామని చెప్పాడు. దాని కోసమే చూస్తున్నా..
---------------------

Nov 1, 2015: ఆ౦ధ్రప్రదేశ్ ముఖ్యమ౦త్రి గారి ప్రస౦గ౦. "నేడు రాష్త్ర౦ మొత్త౦ కోస్తా, రాయలసీమ, తెల౦గాణ ప్రా౦తాలన్నీ కలిసికట్టుగా పురోగాభివ్రుద్ది చె౦దుతున్న౦దుకు ఎ౦తో గర్వ౦గా వున్నది. ముఖ్య౦గా మా పార్టీ.. బ్లా..బ్లా (blah..).. బ్లా..బ్లా. బ్లా..బ్లా..బ్లా..బ్లా.. బ్లా..బ్లా..బ్లా..బ్లా..
ఇకపోతే.. చివరిగా.. యాసలెన్నీ వున్నా , ఈసులు లేవయ్య.. ఒడిదుడుకులెన్ని వున్నా, ఓర్మితో సాగెనయ్యా.. తెలుగుబిడ్దల౦తా సమిష్టిగా సాగెనయ్యా అని తెలుగు భాష పునాదిగా, తెలుగు ప్రజల భావనలను కలుపుతూ, మరుగున పడిపోనున్న తెలుగుతనాన్ని మేల్కొలుపుతున్న 'కూడలి' ప్రప౦చానికి ధన్యవాదాలు తెలుపుకొ౦టూ, మా పార్టీ గుర్తును ఈ రోజు ను౦చి 'కొడవలి' ను౦చి 'కూడలి' గా మారుస్తున్నామని మనవిజేసుకొ౦టున్నాను.
--------------------

Sunday, October 29, 2006

Sunday one-day

ఈ రోజు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మేచ్ లో , ఆస్ట్రేలియా ఓడిపోతే ఇంటికి తిరుగు ప్రయాణం , ఇండియా జట్టు కి అయితే ఆ శ్రమ అక్కరలేదు పాపం, హోం గ్రౌండ్ లో ఆడితే అదే సుఖం మరి.
గ్రెగ్ చాపెల్ వెస్టిండీస్ పై చేసిన వ్యాఖ్యల వలన ఇప్పటికీ వాళ్ళు పౌరుషం తో ఆడు తున్నారని లారా కామెంట్ . ముఖ్యంగా ఇండియా తో. అలా అయితే మన ఆటగాళ్లకి ఆత్మాభిమానం , పౌరుషం లేవనా?? లేక పోతే చాపెల్ బాబాయ్ ఇంతవరకు మన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదా ??
బహుశా ఆత్మాభిమానం, పౌరుషం తో పాటు టాలెంట్ కూడా కావాలేమో..
మొత్తానికి వన్డే మ్యాచ్‌లు " ఏ నిమిషానికి ఏమీ జరుగునో ఎవరూహించేదరూ ..' అన్నట్టుగా ఉన్నాయి అందులోనే మజా ఉందేమో మరి (మ్యాచ్ ఫిక్సింగ్‌లు లేకపోతే .. )

మన మీడియా వాళ్ళు జట్టు ని జట్టుగా ఉంచటానికి ఇష్టపడుతున్నట్టు లేదు. NDTV లో సచిన్ కి ఇంటర్వ్యూ లో ప్రశ్న. " మీ 194 స్కోరు వద్ద ద్రావిడ్ డిక్లేర్ చేయటం పై మీ అభిప్రాయం." మరిచిపోయిన గాయాన్ని రేపటం అంటే ఇదే.. ఆస్ట్రేలియా కోచ్, వాళ్ళ దేశం పై గెలిచేలా చిత్తశుధ్ధి తో మన వాళ్ళకి సలహాలు ఇస్తాడని ఆశిద్దం.
good luck to team India.