Saturday, May 05, 2007

సరదా తెలుగు

రానారె రాసిన తెలుగు నుడికారాలు (పొద్దు లో ) http://poddu.net/?p=97 చదువుతుంటే కొన్ని సరదా సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఇవి నుడి'కారాలు' అనవచ్చో లేదో వివిద ప్రాంతాలలో వాడుక భాష అంటారో తెలియదు..

ఒకసారి హైదరాబాద్ లో నా స్నేహితుడు తన బందువుల వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. (వాడికి అప్పుడే పరిచయం.. ఎవరో వేలు విడిచిన మేనమామ తాలూక అనుకొంట .. వాడికే మొహమాటం ..వాడికి నేను ఇంకొక మొహమాటపు [ బలవంతపు] తోడు )..కాస్త మాటలు అయి 'టిఫినీలు తిన్నారా .. కాఫీలు తాగారా..' అయిన తర్వాత , ఎవరూ పరిచయం లేక పోయిన అన్ని మాటలకి 'ఊ' కొడుతున్ననా పరిస్ఠితి అర్దం చేసుకొని వాడు ఇక బయలుదేరటానికి నిశ్చయించుకొన్నాడు.మళ్ళీ వాడి బుద్ది మారే లోపల బయట పడటం మంచిదని నేను కాస్త ముందు బయటపడ్డా..అయితే వీడు మాత్రం వాళ్ళ ప్రహరీ గేట్ దగ్గర నిల్చొనివున్నాడు. ఏమిరా అని అడిగితే .. 'వాళ్ళూ వస్తారట నన్ను వుండమని చెప్పారు' అని అన్నాడు. ఇంకా విముక్తి లేదన్నమాట అనుకొని కాసేపు బయట వేచివున్నాము.ఎంతకీ ఎవరూ రారు .. వెళ్ళి కనుక్కోరా బాబూ అంటే . వాడు వెళ్ళి అట్నుంచి ముసి ముసి నవ్వులు నవ్వుతూ వచ్చాడు..విషయం ఏమిటంటే .. 'వెళ్ళొస్తానండి' అని మన వాడు అంటే ఆవిడ 'వస్తావుండు బాబు' అన్నారట.. అంటే 'అప్పుడప్పుడు వస్తూ వుండు' అని అర్ధం. మా హీరో కి '(నేను)వస్తాను.. వుండు బాబు' అని అర్ధమైంది... అదన్నమాట..మరి చెప్పటానికి ఏముంది .. అప్పటికే ఆలస్యం అవుతుంది అని వాడిమీద వున్న కోపం అంతా ఒక్కసారి మాయమైంది.
అసలు హాస్టల్ వుండి చదువుకొంటే ఆ మజానే వేరు. .. అన్ని ప్రాంతాల వారు వస్తారు..అన్ని రకాల వాడుక పదాలు తెలుస్తాయి.ఒక్కొక్క సారి నవ్వులతో ముంచెత్తుతాయి.. నేను 10th క్లాస్ లో తరగతి లీడర్ గా వెలగ బెట్టిన రోజులవి. మాకు కృష్ణా జిల్లా నుంచి అనుకొంట ఒకాయన హెడ్మాస్టర్ గా వుండేవారు. ఒకసారి ఆయన 'ఒరేయ్ లెక్కల మాస్టరు పరీక్ష పేపర్లు 'ఎత్తుకొని' వెళ్ళాడ... అని అడిగారు.. కోస్తా జిల్లాలలో 'ఎత్తుకు పోవటం' అంటే దొంగిలుంచుకొని వెళ్ళటం అని వాడుక.అలా అర్ధమై ఆయనేదో సరదాగ అడుగుతున్నారని నేను నవ్వుతున్నాను.(అసలు దొంగిలించాల్సిన అవసరం ఆయనకేంటి అని ఆలోచిస్తూ..)ఆయన కాస్త సీరియస్ 'ఏం నువ్వు చెప్పటం మర్చిపోయావా..' అని అరవగా అప్పుడు ఆయన అభిమతం ఏమిటొ అర్ధమైంది.
ఒకసారి ఒక రాజమండ్రి ప్రాంతం అబ్బాయ్ గ్లాస్ పట్టుకొని (నేను నీళ్ళ జగ్ పట్టుకొని వున్నాను).. తను ఇచ్చుకో అన్నాడు.. నీళ్ళు అనుకొని తన గ్లాస్ లో పోసా..మళ్ళీ ఇచ్చుకో అన్నడు.. మళ్ళీ నీళ్ళు పోసా... చివరికి అర్దమైంది . వాళ్ళ వాడుకలో 'ఇచ్చుకో' అంటే 'పట్టుకో' అని..ఇలా చెప్పుకొని పోతే కుప్పలు.. కుప్పలు.. సరదా తిప్పలు... అసలు అన్ని ప్రాంతాల తెలుగు భాష ప్రయోగం తో సరదాగ ఎవరైనా వ్యాసం రాస్తే బావున్ను.. (హాస్యం వరకే సుమా.. అపహాస్యం కి కాదు).