Sunday, December 17, 2006

చాయ్ కబుర్లు - 4

ఎవరి అలవాట్లు వారివి .. కాదని ఎవరన్నారు ?? ఎవరూ అనవసరం లేదండి , వేష భాషలతో పాటు మన Telugus (తెలుగు వారు) కొన్నిటిని తమ అలవాట్లుగా చెప్పుకోవటానికే తిరస్కరిస్తున్నారు. ఏమిటో అంత అవసరం ??.. ఏమున్నది కాస్త 'కొత్తగా , 'వింత'గా ఉంటే అదొక ఆకర్షణ అనో లేదా బహుశా వినేవాళ్ళ మనోభావాలు అలా ఉంటాయేమోనని ముందుగానే వూహించి అనవసరపు వింతపోకడలు అయివు౦డాలి .

ఇదేదో విదేశాలలో ఉండేవారు మాత్రమే అనుకొంటె పొరపాటే. మన సొంత గడ్డపై కూడా ఇదే పోకడలు. అయితే పూర్తిగా వాళ్ళని తప్పు పడితే అన్యాయమే .. పరిస్థితులు ఆ రకంగా ఉంటున్నాయి. అవసరం బట్టి మారే అలవాట్లు కొన్ని అయితే ..అనవసరంగా ఇతరుల గుర్తింపు కోసం రూపుదిద్దుకొనే అ(న)లవాట్లు కొన్ని..

ఈ పరభాష (వేష) ప్రవేశ౦ ఎప్పటిను౦చో వు౦దనుకో౦డి.
1995 , పూణే లో 6 నెలలు ఉండటం జరిగింది. మన రాష్ట్రం విడిచి బయట ఉండటం అదే మొదటి సారి. అందుకనేమో ఎవరైనా తెలుగు మాట్లాడిన వారు ఉంటే బాగుణ్ణు అని వేష భాషలలో దాగుకోని ఉన్న తెలుగు తనం గూర్చి శోధన మొదలయింది.

మేముండే గెస్ట్ హౌస్ దగ్గర ఛాయ్ 'కమ్' చాట్ ('అధికం') సెంటరు ఉండేది (ఛాయ్ తక్కువ కబుర్లు ఎక్కువ) .. నా పక్కనే కూర్చొని ఉన్న ఒక నార్త్ ఇండియన్ (చూడటానికి అలానే ఉన్నాడు, చెవికి ఒక రి౦గ్ ...etc) న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఎలాగో పలకరించటం అయింది .. రెండు నిమిషాల తర్వాత మీరు తెలుగు వారా?? అని అడిగాను. కాస్త ఆశ్చర్యపోతు అవును అని చెప్పాడు ఆ పరిచయం అలా పూణే లో వచ్చిన మంచి సినిమాలు అన్నిటికి తనతో కలిసి తన బైక్ మీద వెళ్ళటం అయిందనుకోండి (ఒక సారి పరిచయమయిన తర్వాత మన తెలుగుదనం లో ఉన్న గొప్పతనం అది, 'బాబాయ్', 'మామ', 'గురు' అనుకోవటానికి కాలం ఋతువులు మారనవాసం లేదు).

ఇంతకీ మన హీరో మనసులో ఒక సందేహం మూడు నెలల తర్వాత బయటపెట్టాడు .. తాను పూణే వచ్చిన తర్వాత అప్పటివరకు (సుమారు 2 స౦") తన వేషం భాష చూసి ఎవ్వరూ తెలుగు వాడని గుర్తించలేదంట , మరి నాకు ఎలా తెలిసింది అని ??

విషయం తెలిస్తే నేనే కాదు ఈ తెలుగువాడికైనా అట్టే సమయం పట్టదు. నేను కలిసిన ఆ రోజు తను చదువుతున్నది ASIAN AGE న్యూస్ పేపర్ .. అప్పట్లో అంతర్జాతీయ విషయాలని కూడా ప్రచురించే ఒక పత్రిక , అందులో మన వాడు చదువుతున్నది (5 వ పేజీ లో ఓ మూల వున్న "లక్ష్మి పార్వతి " గురించి ఉన్న వార్తని.. : ) .అది తప్పు అనికాదు కొన్ని దాచిన అన్నీ ఎలాగు దాచట౦ అవదు అని.

కనుక చెప్పొచ్చేదేమిటంటే డియర్ 'తెలుగూస్' అనవసరం గా తెలుగు హుందాతనంని దాచేయటం దయచేసి నాగరికం అనుకోవధ్దు,

మన అలవాట్లని, భాషని మనమే గౌరవించక పోతే ఇక వాటిని వేరే వాళ్ళు గొప్పగా గుర్తిస్తారనుకోవటం కల్ల.

అలా అని విదేశాల వీధుల్లో పంచిలు కట్టుకొని తిరగమని కాదు (మన రాష్ట్రములోనే లేదనుకోండి) కానీ ప్రతి రోజు తప్పనిసరి అయి సా౦డ్విచ్లు తింటున్నా... పుల్లట్లు, ఇడ్లీ సాంబార్లు గూర్చి మాట్లాడటం అనాగరికం అనుకోవలసిన అవసరం లేదు. మనం ఎలా వివరిస్తామో వినేవాళ్ళకి అలా అర్ధమవుతుంది.
పరిస్థితులు అనుగుణంగా ఉన్నంత వరకు ఎవరికోసమో మన అలవాట్లను బలవంతంగా మార్చుకోవలసిన అవసరంలేదని నా అభిప్రాయం.

ఎక్కడ ఏది దొరకదో దానికి విలువ ఎక్కువని.. మన దేశంలో Mc.Donalds కి వెళ్ళి విదేశాలకి వచ్చాక వేడి వేడి ఇడ్లీలు వెతికే కన్నా ఎక్కడ ఉన్నవి అక్కడ చక్కగా అనుభవించటం సముచితం.

ఛాయ్ తాగుతూ టా౦క్ బండ్ మీద కూర్చొని కబుర్లు చెప్పే రోజులు మళ్లీ మళ్లీ రమ్మంటే రావు.
call center కారుమబ్బులు కు౦డపోతై కురిసి కమ్మని అలవాట్లని ము౦చే ప్రమాద౦ పొ౦చివు౦ది కనుకనే .. భద్ర౦ బీ కేర్ ఫుల్ బ్రదర్ ..


ఇ౦తకి తెలుగువారి అలవాట్లు ఏమిటో అని ప్రశ్న వచ్చి౦ది అ౦టే . మన అలవాట్లు ఏమిటో ఒకరు గుర్తుచేయాల్సిన సమయ౦ ఆసన్నమయి౦దన్న మాట...!! ఫర్వాలేదు ఇలా మన తెలుగు వాళ్ళ బ్లాగులు చదువుతూ వు౦డ౦డి .. అన్నీ వాటికి అవే గుర్తుకువస్తాయి.

Saturday, December 02, 2006

చాయ్ 'కబుర్లు' - 3




'గతం' మళ్లీ రాదు అంటారు గాని , మన కూడలి బ్లాగులు చదువుతుంటే 'గతం' లో పయనం ఎక్కువుగా కనిపిస్తుంది. సరే ఇక నా జ్ఞాపకాలు గతించక ముందే బ్లాగించితే మంచిదేమో!!.
************************
1993 కార్తీక మాసంలో పిక్నిక్ హడావిడిలో భాగంగా మా కంప్యూటర్ శిక్షణ తరగతి ధన్యార్ధులంతా (అదేనండి ధనార్జన కి సులువైన మార్గం, అని చేరిన విధ్యార్ధులంతా..) ఉత్తర కోస్తాలో సముద్ర తీరాన ఉన్న ఒక వనం కి వెళ్ళటం జరిగింది. దానికి ఆనుకొని ఉన్న ఒక కుగ్రామం, వూహించినట్టే ఎక్కువ మంది జాలార్ల కుటుంబాలు. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ ఎవరి పనులలో వాళ్ళు హడావుడిగా ఉన్నారు.

మూట కట్టుకొని తీసుకెళ్లినవన్ని తిని , తిన్నది కాస్త అరిగే వరకు ఏవో ఆటలు ఆడి, చివరికి అంత్యాక్షరి మొదలయింది ( నా ఉద్దేశ్యంలో ఎప్పటికి అంతం కానిది అని , మన గాత్రం తో పాటు అందరి గాత్రాలు వినే 'సహనం' నేర్పే కార్యక్రమం). అప్పటికే నాకు తెలియని పాటల స౦ఖ్య రె౦డు పదులు దాటాయి. నా దృష్టి అంతా అక్కడికి కాస్త దూరంలో జాలార్లు ఏవో పాటలు పాడుతూ చేస్తున్న పనుల మీద.

కాసేపు అందరి సినీ పరిజ్ఞానం మెచ్చుకొని ఎలాగో మెల్లగా బయట పడ్డాను.


సముద్ర తీరాన ఉన్న ఇసుకదిబ్బల మీద ఒక పెద్ద చేపల పడవ. దానిలో ఒక పది మంది జాలార్లు చేపల 'వల' ను సరిచేస్తూ సరదాగా పాటలు పాడుకొంటూ కనిపించారు.
వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. పడవ దగ్గరకి వెళ్ళి వాళ్ళను పలకరించాను. లోపలికి వచ్చి కూర్చోమన్నారు.

ఇక ఒక విలేకరిలా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాను. వాళ్ళ రోజు వారి పనులు, అమ్మకాలు, లాభ నష్టాలు, డబ్బు ఎలా పొదుపు చేసుకొనేది , వాళ్ళ పండగలు , ఊరిలో ఉన్న సౌకర్యాలు ...,

ఇక కొంతసెపాటికీ వాళ్ళకు వాళ్లే నేను అడగకుండానే చాలా విషయాలు చెప్పట౦ మొదలుపెట్టారు,(బహుశ నా దగ్గర ప్రశ్నలు ఇక లేవని గమని౦చినట్టు వున్నారు) వాళ్ళ కున్న కనీస అవసరాల బాధలు చెప్ప సాగారు. వాళ్ళ వూరికి సరైన రోడ్డు కూడా లేదు. ఒక అయిదు ఏళ్ళ క్రిత౦ వేసిన బోరి౦గ్, .....ఇలా..


ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేస్తారు అని అడిగాను. దానికి అ౦దరి సమాధాన౦ ఒక్కటే. ఇ౦తకీ అతను అసలు ఎప్పుడూ ఆ ఊరు రానే లేదు. మరి....
(అక్కడ పోటీ చేసే అతను రాజ కుటుంబీకుడు , పూర్వం ఎప్పుడో వారి రాజ కుటుంబములో యుద్దం సమయంలో మరణించిన రాజ వనిత అక్కడ అమ్మవారి (గ్రామ దేవత) గా ప్రసిద్ది. కనుక ఇ౦క ఎవరికి ఓటు వేసిన అమ్మవారికి కోపం వచ్చి తుఫానులో పడవలు కొట్టుకెళ్లి పోతాయన్నది వాళ్ళ అపనమ్మకం). అది విన్న తర్వాత అర్ధమయ్యింది ఆ నాయకుడు అన్ని సార్లు ఎలా గెలిచాడా అని.
ఇలా మాటల్లో తెలియకు౦డనే సాయ౦త్ర౦ గడిచి౦ది.

అసలు నేను చేసిన సహాయం ఏమీ లేదు గాని వాళ్ళతో కాసేపు చేరి వాళ్ళ గోడు విన్నందుకు ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు చెప్పారు.
ఈ పరిస్థితులు ఇప్పటిలో మారేవి కావులే అనే నిట్టూర్పు తో నిరాసగా సూర్యుడు కనుమరుగయ్యాడు.

తిరుగు ప్రయాణంలో మళ్లీ వ్యానులో అంత్యాక్షరి , అదే స౦ధర్బ౦ అ౦దరి మన్ననలకి ఒక సదవకాస౦ లా తలచి గొ౦తు చి౦చుకొని 'పాడు'తున్నారు.
కానీ ఎందుకనో అందరిలాగ పాడలేకపోయాను. ఎ౦దుకనో నా గొంతు మూగబోయింది. అన్ని భాదలు ధిగమి౦గుకొని పాటలతో పనులు చేసుకొ౦టూ వున్న జాలార్ల జీవన శైలి గూర్చి ఆలోచిస్తూ వు౦డిపోయాను.

వ్యాన్ ము౦దుకి దూసుకొని వెళ్తున్నది, ప్రప౦చ౦ ( ప్రగతి) వెనక్కి వెళ్తున్నట్టు అనిపి౦చి౦ది.
అప్పుడే విచ్చుకొన్న పద్మ౦లా పైకి వస్తున్న కార్తీక ని౦డు చ౦ద్రుడు ని, కిటికీ లో౦చి చూస్తూ... వాళ్ళు నమ్ముకున్న ఆ గ్రామ దేవత అయిన వాళ్ళ ఆశలు నెరవేర్చాలని మనసులో కోరుకొన్నాను.

************************

మన దేశంలో ఉన్న అక్ష్యరాస్యత తక్కువ, పైగా అ౦దులో చదువుకున్న వాళ్ళు కూడా ఓటు వినియోగించుకొనేది ఇ౦కా తక్కువ. ఇక మంచి నాయకులు ఎక్కడ నుంచి వస్తారు. పరిస్థితులు మారేది ఎప్పుడు.??