Saturday, December 02, 2006

చాయ్ 'కబుర్లు' - 3




'గతం' మళ్లీ రాదు అంటారు గాని , మన కూడలి బ్లాగులు చదువుతుంటే 'గతం' లో పయనం ఎక్కువుగా కనిపిస్తుంది. సరే ఇక నా జ్ఞాపకాలు గతించక ముందే బ్లాగించితే మంచిదేమో!!.
************************
1993 కార్తీక మాసంలో పిక్నిక్ హడావిడిలో భాగంగా మా కంప్యూటర్ శిక్షణ తరగతి ధన్యార్ధులంతా (అదేనండి ధనార్జన కి సులువైన మార్గం, అని చేరిన విధ్యార్ధులంతా..) ఉత్తర కోస్తాలో సముద్ర తీరాన ఉన్న ఒక వనం కి వెళ్ళటం జరిగింది. దానికి ఆనుకొని ఉన్న ఒక కుగ్రామం, వూహించినట్టే ఎక్కువ మంది జాలార్ల కుటుంబాలు. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ ఎవరి పనులలో వాళ్ళు హడావుడిగా ఉన్నారు.

మూట కట్టుకొని తీసుకెళ్లినవన్ని తిని , తిన్నది కాస్త అరిగే వరకు ఏవో ఆటలు ఆడి, చివరికి అంత్యాక్షరి మొదలయింది ( నా ఉద్దేశ్యంలో ఎప్పటికి అంతం కానిది అని , మన గాత్రం తో పాటు అందరి గాత్రాలు వినే 'సహనం' నేర్పే కార్యక్రమం). అప్పటికే నాకు తెలియని పాటల స౦ఖ్య రె౦డు పదులు దాటాయి. నా దృష్టి అంతా అక్కడికి కాస్త దూరంలో జాలార్లు ఏవో పాటలు పాడుతూ చేస్తున్న పనుల మీద.

కాసేపు అందరి సినీ పరిజ్ఞానం మెచ్చుకొని ఎలాగో మెల్లగా బయట పడ్డాను.


సముద్ర తీరాన ఉన్న ఇసుకదిబ్బల మీద ఒక పెద్ద చేపల పడవ. దానిలో ఒక పది మంది జాలార్లు చేపల 'వల' ను సరిచేస్తూ సరదాగా పాటలు పాడుకొంటూ కనిపించారు.
వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. పడవ దగ్గరకి వెళ్ళి వాళ్ళను పలకరించాను. లోపలికి వచ్చి కూర్చోమన్నారు.

ఇక ఒక విలేకరిలా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాను. వాళ్ళ రోజు వారి పనులు, అమ్మకాలు, లాభ నష్టాలు, డబ్బు ఎలా పొదుపు చేసుకొనేది , వాళ్ళ పండగలు , ఊరిలో ఉన్న సౌకర్యాలు ...,

ఇక కొంతసెపాటికీ వాళ్ళకు వాళ్లే నేను అడగకుండానే చాలా విషయాలు చెప్పట౦ మొదలుపెట్టారు,(బహుశ నా దగ్గర ప్రశ్నలు ఇక లేవని గమని౦చినట్టు వున్నారు) వాళ్ళ కున్న కనీస అవసరాల బాధలు చెప్ప సాగారు. వాళ్ళ వూరికి సరైన రోడ్డు కూడా లేదు. ఒక అయిదు ఏళ్ళ క్రిత౦ వేసిన బోరి౦గ్, .....ఇలా..


ఎలక్షన్ లో ఎవరికి ఓటు వేస్తారు అని అడిగాను. దానికి అ౦దరి సమాధాన౦ ఒక్కటే. ఇ౦తకీ అతను అసలు ఎప్పుడూ ఆ ఊరు రానే లేదు. మరి....
(అక్కడ పోటీ చేసే అతను రాజ కుటుంబీకుడు , పూర్వం ఎప్పుడో వారి రాజ కుటుంబములో యుద్దం సమయంలో మరణించిన రాజ వనిత అక్కడ అమ్మవారి (గ్రామ దేవత) గా ప్రసిద్ది. కనుక ఇ౦క ఎవరికి ఓటు వేసిన అమ్మవారికి కోపం వచ్చి తుఫానులో పడవలు కొట్టుకెళ్లి పోతాయన్నది వాళ్ళ అపనమ్మకం). అది విన్న తర్వాత అర్ధమయ్యింది ఆ నాయకుడు అన్ని సార్లు ఎలా గెలిచాడా అని.
ఇలా మాటల్లో తెలియకు౦డనే సాయ౦త్ర౦ గడిచి౦ది.

అసలు నేను చేసిన సహాయం ఏమీ లేదు గాని వాళ్ళతో కాసేపు చేరి వాళ్ళ గోడు విన్నందుకు ఎంతో కృతజ్ఞతతో వీడ్కోలు చెప్పారు.
ఈ పరిస్థితులు ఇప్పటిలో మారేవి కావులే అనే నిట్టూర్పు తో నిరాసగా సూర్యుడు కనుమరుగయ్యాడు.

తిరుగు ప్రయాణంలో మళ్లీ వ్యానులో అంత్యాక్షరి , అదే స౦ధర్బ౦ అ౦దరి మన్ననలకి ఒక సదవకాస౦ లా తలచి గొ౦తు చి౦చుకొని 'పాడు'తున్నారు.
కానీ ఎందుకనో అందరిలాగ పాడలేకపోయాను. ఎ౦దుకనో నా గొంతు మూగబోయింది. అన్ని భాదలు ధిగమి౦గుకొని పాటలతో పనులు చేసుకొ౦టూ వున్న జాలార్ల జీవన శైలి గూర్చి ఆలోచిస్తూ వు౦డిపోయాను.

వ్యాన్ ము౦దుకి దూసుకొని వెళ్తున్నది, ప్రప౦చ౦ ( ప్రగతి) వెనక్కి వెళ్తున్నట్టు అనిపి౦చి౦ది.
అప్పుడే విచ్చుకొన్న పద్మ౦లా పైకి వస్తున్న కార్తీక ని౦డు చ౦ద్రుడు ని, కిటికీ లో౦చి చూస్తూ... వాళ్ళు నమ్ముకున్న ఆ గ్రామ దేవత అయిన వాళ్ళ ఆశలు నెరవేర్చాలని మనసులో కోరుకొన్నాను.

************************

మన దేశంలో ఉన్న అక్ష్యరాస్యత తక్కువ, పైగా అ౦దులో చదువుకున్న వాళ్ళు కూడా ఓటు వినియోగించుకొనేది ఇ౦కా తక్కువ. ఇక మంచి నాయకులు ఎక్కడ నుంచి వస్తారు. పరిస్థితులు మారేది ఎప్పుడు.??

4 comments:

రాధిక said...

చదువురాని వాల్లకి చెపితె అర్దంకాదు.చదువుకున్న వాల్లం చెపితె వినం.అందుకే ఎంతో శక్తి వున్న ఓటు కి ఇప్పుడు ఈ గతి పట్టింది.ఇక ఏ పల్లెటూరు చూసినా అదే పరిస్తితి. జాలరుల బ్రతుకులు అంటారా...మరీ అద్వాన్నం.ప్రతి ఒక్కరు అక్షరాస్యులు అయితేనెగానీ ఈ దేశ పరిస్తితి మారదు.మీ రచన శైలి బాగుంది.

Naveen Garla said...

చాలా మంచి జ్ఞాపకాలని అంతకంటే అందంగా వ్రాసారు.
నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

వడ్లూరి కేశవా చారి said...

మీ రచనా శైలి బాగుందండీ....
కొన్నింటికి మీరిచ్చిన వివరణలు నవ్వు తెప్పించాయి....
యిక విషయానికొస్తే.... మన దేశంలొ ప్రజాస్వామ్యం అలాగే ఏడ్చింది....
అక్షరాస్యులు మాత్రం ఆలోచించి ఓటేస్తున్నారా....

Ravindra Prasad said...

Good one Sai. Keep it up