Saturday, April 07, 2007

గత కాలం నాటి కవిత - 2

మనసు ఉల్లాసంగా వున్నప్పుడు మదిలో ఏవో భావాలు మెదిలి, నాలిక మీద కదులుతున్న నాలుగు పదాలను కుదురుగా కూర్చి ప్రాస పూతను పూస్తే మంచి కవితగా మారుతుందని నా అనుభవం , అభిప్రాయం।

అయితే ఈ క్రింద వుంచనున్న నాలుగు పంక్తులు ఏ వర్గం లోనికి వస్తుందో తెలియదు , అసలు తన మనస్సుకి స్పృసించిన సందర్భంలో కవిగారికి ఆ ఆలోచన వచ్చే ప్రసక్తే లేదనుకొండి।
ఇక విషయానికి వస్తే , మా నాన్నగారు తన చిన్నప్పుడు రచించి ప్రచురితమైన కొన్ని కవితలని భ్లాగులో వుంచే ప్రయత్నంలో అడిగితే తను చెప్పిన నాలుగు మాటలు॥

అవి 1950సం,, వారి గ్రామంలో రెండు ఏళ్ళుగా వర్షాలు , పంటలు లేక చాలా కుటుంబాలకి తిండి కూడ కరువైందట. వీళ్ళ ఇంటిలో వండిన అన్నం గంజి కోసం చాలా మంది కాసుకొని వుండే వారట..
కొన్ని ప్రాంతాలకి రంగూన్ నుంచి తెప్పించిన ఎరుపు బియ్యం లభించేదట॥ అక్రమాల వలన అవి కూడ అందరికి అందేవి కాదట। ఆ పరిస్థితులలో తనకి ఆవేదనతో కదిలిన భావాలు నాలుగు పంక్తులలో॥

కష్టాలే కలకాలం కాపురాలు చేయాలా??
ఎన్నాళ్ళూ కాలువలై కన్నీరే పారాలా ??
ఆనందాలు అధోగతిని అణిగిపోయి వుండాలా??
మోసంపై దినం దినం మోజు పెరుగుతుండాలా ??
అవునట్టు ఇవి ఏ పత్రికలో లోను ప్రచురితం అవలేదు కాని తన మనస్సులో మాత్రం ముద్రించబడి వున్నాయని తన మాటల్లో తెలుసుకో గలిగాను॥
అప్పటికి , ఇప్పటికి కాలచక్రం అయిదు పదులు తిరిగింది , పరిస్థితులు రూపులు మారి సమస్యలు కొత్త వేషం దాల్చాయి। ఎటుపోతున్నమో తెలుసుకొనే తీరిక లేదు, ఇక దానిపై విశ్లేషణ సరేసరి।
నిజానికి బ్లాగుల పుణ్యమా అని మరుగుపడుతున్నభాష అయిన కాస్త మెరుగులు దిద్దుకొంటుంది।

2 comments:

మన్యవ said...

కవిత పుట్టుక గురించి మీరు చెప్పింది చదివాక నాకు "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి గారి ఇంటర్వ్యూ లో చదివిన, వారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఆయన అన్నది నాకు literal గా గుర్తు లేదు. కాని ట్రై చేస్తాను. "సునామీ రాగానే వెంటనే రెండో రోజే దాని మీద కవితలు రాసేసారు. అసలు ఎదైనా ఒక సంఘటన విన్నప్పుడు మనస్సు దాని సంబధించిన భావాలతో నిండి ఆ effect మనసు మీద కొంత సమయం వున్నాక ఆ భావాల వల్ల సంకీర్ణమైన మనసులోంచి దానంతట అదే కవిత పుడ్తుంది". మీ నాన్న గారు రాసినది అట్లా పుట్టినదే అని నాకు అనిపించింది.

Sudhakar said...

ఇప్పటికీ అచ్చు గుద్దినట్లు సరిపోయే ఆవేదన ఇది.