Sunday, April 01, 2007

గత కాలం నాటి కవిత

మా నాన్నగారు తను ఉద్యోగ ప్రయత్నాల సమయంలో చేసిన కొన్ని రచనలు వారపత్రికలలో ప్రచురింపబడ్డాయి।
అవి ఇప్పుడు చదువుతుంటే అప్పటి కాలం నాటి స్ఠితిగతులు , వాళ్ళ భావావేశాలు తెలుస్తుంటాయి। వాటిలో కొన్ని సేకరించగలిగాను. మచ్చుకకి ఒకటి।

ఇప్పటి తరంకి అంతగా పట్టవు వద్దు అని తను వారించినా మన కూడలి లో కొన్ని మంచి టపాలు తనకి చూపించి మరి ఒప్పించాను। అప్పటిలో గ్రామపంచాయతీల ఏర్పాటు, పంచశీల పదకాల మీద॥

1965 వాణి పత్రికలో ప్రచురితమైన కవిత॥

ఆశలూ - ఆశయాలు

అతి సు౦దర స్వప్నాలను
కనులము౦దు గా౦చుతాను
నా దేశపుటున్నతికై
నా మాటలు పలుకుతాను !

నా దేశ౦! నా ప్రాణ౦ !
రె౦డిటికి లేదు భేద౦ !
సమభావపు టౌన్నత్య౦
పెరగాలిక ప్రతినిత్య౦!

అభేద్యమౌ సమస్యలకు
అ౦తు చిక్కి పోవాలి !
తరతమ భేదాలన్నవి తరలి పారిపోవాలి !
ప౦చశీల సూత్రాలను పదిమ౦దికి తెలియజేసి,
వ౦చనలకు తావు లేని మ౦చి రధ౦ నడపాలి !

పల్లెసీమ పాడి ప౦ట ప౦చాయతి పె౦చాలిక !
పట్టణాల భాగ్యానికి పరిశ్రమలు పెరగాలిక!
దురాక్రమణ దుష్టశక్తి దూరానికి జరగాలిక!
ఆకలి యాక్ర౦దనలు అలసి పారిపోవాలిక !

ఆనాడే నా కమ్మని ఆశయాలు ఫలిస్తాయి!
నా దేశ౦ నానాటికి నాక౦లా మారుతు౦ది!

7 comments:

oremuna said...

బాగుంది

మిగిలినవి కూడా ఉంచండి

సత్యసాయి కొవ్వలి Satyasai said...

బాగుంది. కవి పేరు కవితనానుకునే ఉంటే బాగుంటుంది. ఆయనచేతే ఒక బ్లాగు మొదలుపెట్టిస్తే బహుబాగేమో.

చదువరి said...

కవిత బాగుంది వాస్తవికంగా ఉంది. ఆశావాదంతో ఉంది. నాటి సమస్యలు కొన్ని నేడూ అభేద్యమే! నాలుగు దశాబ్దాల నాటి ఈ కవిత నేటి పరిస్థితులకూ సరిపోతుంది. అయితే సమస్యలు మారాయి. దురాక్రమణ దుష్టశక్తి అంటే బహుశా నాటికి రెండేళ్ళకు ముందు చైనా చేసిన దురాక్రమణ కావచ్చు. అక్సాయిచిన్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉంది.

రానారె said...

నక్క ఎక్కడ నాకలోకం (అంటే దేవలోకం) ఎక్కడ అనే నానుడిలోనే తప్ప నాకం అనే పదాన్ని మరెక్కడా చూడలేదిన్నాళ్ళూనేను. బాగుంది. దీని ఉద్దేశాన్ని మరికొంత వంటబట్టించుకోవాలి మన తరంకూడా.

రాధిక said...

ఇప్పటి సమాజానికి కూడా సరిపోతున్న కవిత.అందుకే మన తాతలు ఇంకా స్వరాజ్యం రానట్తే వుందని బాధపడుతున్నారు."నాక"మంటే ఏమిటని అడుగుదామనుకున్నాను..రానారే వ్యాఖ్యలో సమాధానం దొరికేసింది.ఆసా గారు మరిన్ని కవితలను అందించండి.నాటి సంగతులు,వారి ఆలోచనలను కూడా తెలుసుకునే భాగ్యం కలుగుతుంది.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నా అప్రస్తుత ప్రసంగాన్ని మన్నించడి. "ఇప్పటి తరంకి" అనవచ్చునా ? "తరానికి" అని కదా మాట్లాడేటప్పుడు అందరమూ అనేది ?

ఆసా said...

ఏదో లోపం వుంది అనుకొన్నాను , తెలియజేసిన సత్యసాయి గారికి మరియు అ౦దరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

కవిగారి పేరు .. బలివాడ వెంకట రామారావు.
సుబ్రహ్మణ్యం గారు, అప్రస్తుతం అనుకోడానికి ఏమి లేదండి. సరిదిద్దేది శ్రేయోభిలాషులే కదా!